18, జూన్ 2014, బుధవారం

శిష్ఠ వచన విశిష్ఠత


(ఓ ప్రవక్తా!) ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌ – అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడని నువ్వు బాగా తెలుసుకో”. (ముహమ్మద్‌:19)
‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ ఈ శిష్ఠ వచన ఆధారంగానే భుమ్యాకాశాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ వచన వ్యక్తీకరణ, స్మరణ కోసమే సృష్టి చరా చరాల సృజన జరిగింది. ఈ వచనం కోసమే అల్లాహ్‌ా ఇహపరాలను పుట్టించాడు. ఈ శిష్ఠ వచన పరిచయం కోసమే 1లక్ష 24వేల మంది దైవప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఈ వచన ఘనతా ఔన్నత్యాలను చాటడానికే దైవగ్రంథాలు అవతరించాయి. ఈ వచనం కోసమే తీర్పు దినం, లెక్కల ఘడియ, మహ్షర్‌ మైదానం ఏర్పాటు చేయబడింది. ఈ వచనం కోసమే స్వర్గనరకాలు చేయబడ్డాయి. ఈ వచన ఆధారంగానే మనుషులు, జిన్నాతులు-విశ్వాసులుగా, అవిశ్వాసులుగా, సజ్జనులుగా, దుర్జనులుగా, పుణ్యాత్ములుగా, పాపాత్ములుగా వర్గీకరించబడ్డారు. ఈ వచనం మూలానే సృష్టి అదృష్ట దురదృష్టాలు, సౌభాగ్యాసౌభాగ్యాలు, అభ్యున్నతి, అభ్యుదయాలు, ప్రగతి సాఫల్యాలు, సంక్షేమం శ్రేయో శుభాలు, శిక్షాబహుమానాలు ముడి పడి ఉన్నాయి. ఈ వచన ఆధా రంగానే రేపు మన కర్మల త్రాసు బరువుగానైనా, తేలికగానైనా తయా రవుతుంది. ఈ వచన ఆధారంగానే పరలోక మోక్షం ప్రాప్తమవు తుంది. ఈ వచన ఆధారంగానే కొందరు శాశ్వత నరకానికి ఆహుతి అయితే, మరికొందరు శాశ్వత స్వర్గానికి వారసులవుతారు. ఈ వచ నం గురించే అల్లాహ్‌ా పరమాణువుల లోకంలో సకల ఆత్మలతో ‘అలస్తు ప్రమాణం’-నేను మీ ప్రభువు కానా!’ అన్న ప్రమాణం తీసుకు న్నాడు. ఈ వచన ఆధారంగానే ముస్లింల ప్రార్థనా దిశ నియామకం జరిగింది. ఈ వచన ఆధారంగానే శ్రేష్ఠ సముదాయం వెలుగులోకి వచ్చింది.
ఈ శిష్ఠ వచనం అల్లాహ్‌ తన దాసులకు అనుగ్రహించిన గొప్ప వర ప్రసాదం. ఈ వచన భాగ్యానికి మించిన భాగ్యం మరొకటి  లేదు. ఈ వచన స్థాపన కోసమే సకల ప్రవక్తలు, సత్పురుషులు సంఘ బహిష్కర ణలకు, హత్యలకు, మారణకాండలకు గురయ్యారు. కొందరు నిలు వునా రెండుగా రంపాలతో కోయబడ్డారు. కొందరిని సజీవంగానే ఉంచి ఇనుప దువ్వెనలతో రక్కి మాంసాన్ని ఎముకల నుండి వేరు పర్చడం జరిగింది. కొందరిని సలసల మరగే నూనేలో నెట్టి వేంచే యడం జరిగింది. కొందరిని నిప్పులపై పడుకోబెట్టడం జరిగింది. కొందరిని సాపల్లో చుట్టి పొగెట్టడం జరిగింది. కొందరిని శిలువనెక్కిం చడం జరిగింది. మరికొందరిని వ్రేలాడదీసి శరీరాన్ని ముక్కముక్కలు గా కోయడం జరిగింది. ఈ వచన ఆధారంగానే సత్యాసత్యాల మధ్య సమర జ్వాలలు భగ్గుమన్నాయి. ఇదే శిష్ఠ వచనం, ఇదే శాంతి వచ నం, ఇదే శ్రేష్ఠ స్మరణ, ఇదే శాంతి నిలయం అయిన స్వర్గానికి తాళం చెవి. ఈ వచనాన్నే అల్లాహ్‌ ‘కలిమతున్‌ తయ్యిబా-సద్వచనం’ అని ‘ఉర్వతున్‌ ఉస్ఖా-బలీయమయిన కడియం’ అని అభివర్ణించాడు. ఇదే  సత్య వచనం, ఇదే ధర్మ ప్రవచనం, ఇదే మహి మాన్విత, మహోత్కృష్ట పుణ్య వచనం. ఇదే చిత్త శుద్ధికి చిహ్నం, దాసుని అంకితభావానికి ఆనవాలు, పుణ్యఫలానికి పునాది. ఇదే ధర్మ సందేశం. ఇన్ని వీశిష్ఠతల కారణంగానే ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అన్నింటికంటే ఉత్కృష్ట అల్లాహ్‌ స్మరణ – ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌”. (తిర్మిజీ)
ప్రవక్త నూహ్‌ (అ) వారికి మరణ ఘడియలు సమీపించినప్పుడు తన కుమారుణ్ణి పిలిచి ఇలా హితవు పలికారు: ”కుమారా! నేను నీకు రెండు విషయాల గురించి తాకీదు చేస్తున్నాను. రెండు విషయాల నుండి నిన్ను వారిస్తున్నాను. ఆయన చెప్పిన వాటిలో-”సప్తాకాశాలు, సప్త భూములు త్రాసు ఒక పళ్ళెంలో పెట్టి, ‘లా ఇలాహ ఇల్ల ల్లాహ్‌’ మరో పళ్ళెంలో పెట్టినట్లయితే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ ఉన్న పళ్ళమే వంగుతుంది’. సప్తాకాశాలు, సప్త భూములు ఒక ముద్దలా పదార్థంలా ఏర్పడితే వాటిన్నంటినీ లా ఇలాహ ఇల్లహ్‌ ఇల్లల్లాహ్‌ వేరు పరుస్తుంది. (అహ్మద్‌) ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది:
”భూమ్యాకాశాలు కలిసి ఉండగా, మేము వాటి ని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతీదానిని మేము నీటితో సృష్టించాము”. (అన్బియా:30)
సృష్టి మొత్తం కలిసి కూడా ఈ వచనానికి సరి తూగజాలదు అంటే ఈ వచనం ఎంతటి మహి మాన్వితమయినదో అర్థం చేెసుకోగలరు. ఈ కారణంగానే విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) తన జాతి వారిని, తద్వారా సమస్త మాన వాళిని తొలుత పిలుపునిచ్చింది ఈ శిష్ఠ వచనం వైపునకే. ఓ ప్రజలారా! మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్‌ చెప్పండి. తద్వారా అరబ్బు, అరబ్బేతర ప్రాంతాలు మీ పాదాక్రాంతమవుతాయి’ అని చెప్పారు.
ప్రియ పాఠకుల్లారా! ఒక వ్యక్తి ఈ వచనాన్ని చదివే ఇస్లాం పరిధిలోకి ప్రవేశిస్తాడు. మనం కూడా ఈ శిష్ఠ వచనం ఆధారంగానే ముస్లింలు గా పరగణించబడుతున్నాము. ఈ వచనం మరి
పెద్దదేమీ కాదు. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’. అయితే ఈ వచనాన్ని ఓ వ్యక్తి మనసా, వాఛా, కర్మణా-త్రికరణ శుద్ధితో ఉచ్చరించిన మరుక్ష ణమే అతని జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి.
ఆయన ఆబూ జర్‌ గిఫారీ (ర). మక్కా వచ్చిన ఆయన ప్రవక్త (స) ముహమ్మద్‌ వారితో కలవాలనుకున్నారు. కాని మక్కా అవిశ్వాసులు అంత సులువుగా ఎవరినీ ఆయనతో కలవనిచ్చేవారు కాదు గనక నక్కి నక్కి తిరగుతున్నా రాయన. ఎవరయినా గమనిస్తారేమోనని భయ పడుతున్నారు. చివరికి దైవప్రవక్త (స) వారి సన్నిధికి చేెరి ఈ శిష్ఠ వచన ప్రమాణం తీసుకున్న మరుక్షణం ఆయనలో ఎక్కడ లేని ధైర్యం పెల్లుబికింది. అప్పటి వరకు పిరికితనం ఆవహించిన ఆయన గుండె లో సాహసం ఉప్పొంగింది. క్షణం క్రితమే తనను ఎవరయినా గమని స్తారేమో అని భయపడిన ఆయన మొక్కవోని సాహసంతో కాబా ప్రాం గణంలోకెళ్ళి అందరి సమక్షంలో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ సద్వచన ప్రమాణాన్ని బాహాటంగా ప్రకటించారు.  అది విన్న అవిశ్వాస ప్రజలు ఆయనపై విరుచుకు పడ్డారు. ఆయన్ను చితక బాదుతున్నారు. అయినా ఆయన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ శిష్ఠ వచనాన్ని జపిస్తూనే ఉన్నారు. ఇది కేవలం ఆయన ఒక్కరి విషయంలోనే కాదు, బిలాల్‌, మస్‌అబ్‌ బిన్‌ ఉమైర్‌, సుమయ్యా, యాసిర్‌, అమ్మార్‌, ఖబ్బాబ్‌, అబూ సలమా, అబూ బకర్‌, సుహైబ్‌ రూమీ-ఇలా ఒక్కరిద్దరు కాదు వందలాది, వేలాది,లక్షలాది ప్రజల్లో, నేడు 170 కోట్ల మంది ప్రజల్లో చైతన్యాన్ని నింపిన సద్వచనం లా ఇలా ఇల్లల్లాహ్‌ా.
అవును, ఈ శిష్ఠ వచనం చదవని క్షణ క్రితం వరకు కాఫిర్‌, అవిశ్వాసిగా ఉన్న మనిషి ఈ వచనం చదవిన మరుక్షణం అతను ముస్లిం, విశ్వాసి అయ్యాడు. ముందు అపరిశుద్ధ ఆలోచనలకు ఆలవాలంగా ఉన్న అతను ఇప్పుడు పవిత్ర ఆలోచనలకు నిలయంగా మారాడు. గతంలో అల్లాహ్‌ ఆగ్రహానికి ప్రాతుడయిన అతను, ఇప్పుడు అల్లాహ్‌ా అనుగ్రహానికి, అభిమానానికి అర్హుడయ్యాడు. ముందు స్వీయ సిద్ధాంతాల, నిజం లేని ఇజాల కారణంగా నరక వాసిగా ఉన్న అతను ఇప్పుడు స్వర్గవాసుల జాబితాలో చేరి పోయాడు. ఈ మార్పు ఇక్కడితోనే ఆగిపోయేది కాదు. అది మనిషి జీవితపు అన్ని అంగాల్లోనూ, అన్ని రంగాల్లోనూ, అతని సంబంధించిన క్రియలన్నిం టిలోనూ ఇది ప్రతిబింస్తుంది. ఈ వచనాన్ని సమ్మతించి పఠించే వారంతా ఒక సముదాయాం (ఉమ్మత్‌)గా, శ్రేష్ఠ సమాజంగానూ, దీన్ని త్రోసి పుచ్చినవారు మరో సంఘంగా రూపొందుతారు.
ఏమిటి? కేవలం నాలుకతో కొన్ని అక్షరాలను, పదాలను ఉచ్చరించ డం వల్ల ఇంతటి పెనుమార్పు సాధ్యమేనా? అన్న సందేహం అందరికి రావచ్చు. నిజమే, మంత్రాలకే చింతకాయలు రాలుతాయో లేదో, పర్వ తాలు కంపిస్తాయో లేదో, భూమి బ్రద్ధలవుతుందో లేదో, సముద్రాలు ఉప్పొంగుతాయో లేదో ఆ మంత్రాలను సర్వస్వంగా భావించేవారి వివేకానికే, బుద్ధికే వదిలేద్ధాం. ఎందుకంటే, ప్రభావమంతా పదాల్లోనే ఉంటుందని, వాటిని పలుకగానే మాయా ద్వారాలు తెరుచుకుంటా యని వారి విశ్వాసం, నమ్మకం. కాని ఇస్లాంలో అలా కాదు. అర్థానికే ఇక్కడ అగ్రపీఠం. పరమార్థానికే ఇక్కడ ప్రాధాన్యత, శబ్ధ ప్రభావం అర్థానికి లోబడి ఉంటుంది. అర్థమే అర్థం కాకపోతే అనర్థాలు జరుగు తాయి.   ఈ వచన భావం మనో ధరణిలో నాటుకోకపోతే, దాని శక్తి వల్ల మన భావాలు, స్వభాలు, ప్రవర్తన, ఆచరణలు మారకపోతే కేవలం కొన్ని పదాలను ఉచ్చరించినంత మాత్రాన ప్రళయం ఏమి ముంచుకు రాదు. మహిమ ఏదీ జరిగిపోదు. మహిమ జరుగుతుంది, పెను మార్పు చోటు చేసుకుంటుంది. కాని ఎప్పుడు? ఎప్పుడయితే మనం ఆ వచనాన్ని నోటితో పలికి, మనసుతో అంగీకరించి, అవయవాలతో దానికనుగుణంగా సదాచరణలు చేస్తామో అప్పుడు.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ ఈ శిష్ఠ వచనాన్ని మనం అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుని పలికినట్లయితే- అప్పుడు తెలుస్తుంది- మనం అల్లాహ్‌ా ఎదుట, సమస్త లోకాల ఎదుట ఎంత గొప్ప ప్రమాణం చేస్తు న్నామో. ఆ ప్రమాణం కారణంగా ఎంత గొప్ప బాధ్యత మనపై మోప బడుతుందో.
ఈ వచనాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించాక మన భావ నలపై, అభిప్రాయాలపై, అలోచనపై, ఆచరణలపై, జీవితంలో ప్రతి విభాగంపై ఈ కలిమా ఆధిపత్యమే ఉండాలి. ఆ తర్వాత మన మనో మస్తిష్కాల్లో ఈ కలిమాకు విరద్ధమయిన ఏ విషయానికయినా, ఏ మాటకయినా, బాటకయినా చోటు ఇవ్వకూడదు. మన జీవితంలోని కార్యకలాపాలన్నింటిలో ఈ కలిమా మాత్రమే సర్వాధికారిగా ఉండాలి. ఎందుకంటే, ఈ కలిమాలో ఉన్నది సర్వలోక అధికారి అయిన అల్లాహ్‌ గనక.
ఈ వచనం పలికిన మరుక్షణం ప్రవక్త (స) వారి మాట మన విష యంలో నిజమవుతుంది. అవిశ్వాసుల స్వర్గంగా ఉన్న ప్రపంచం మన కోసం అడుగడున ఆంక్షలతో కూడిన చెరసాలగా మారి పోతుంది.  ఇప్పుడి మనం అల్లాహ్‌ ఆజ్ఞాబద్ధులయి జీవించాలి. ఆయన ఆదేశిం చిన వాటన్నింటిని అమలు పర్చాలి. ఆయన వారించిన వాటన్నింటి నుండి వైదొలగాలి. మన ప్రతి చర్య, ప్రతి క్రియ, ప్రతి కదలిక, ప్రతి శ్వాస ఆయన ఆజ్ఞల పద్దుల్లోనే, ఆయన ప్రవక్త (స) వారి ఆదర్శల సరిహద్దుల్లోనే, ఆయన గ్రంథ హద్దుల్లోనే జరగాలి. అయితే ఇంతటి మహిమాన్విత వచనాన్ని నిత్యం ఉచ్చరించే ముస్లింల, మన  జీవితా ల్లో ఎందుకు ఆశించినంత మార్పు కనబడటం లేదు? ‘అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడు లేడు’ అంటూనే అనేకానేక మిథ్యాభావాల ఉచ్చులో బిగించుకుపోతున్నాము. ఆయన దరిని వదలి దరి దరిన తలను వంచుతున్నాము.  ఆత్మావలోకానికి సమయమిదే!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి