18, జూన్ 2014, బుధవారం

ఇస్లాం దృష్టిలో సమాధుల పూజ


దైవ ప్రవక్త (స) క్రైస్తవుల్లో జొరబడిన షిర్క్‌ గురించి చెబుతూ ఇలా అన్నారు: ”వారు తమలోని పుణ్యపురుషులు  చనిపోయిన తరువాత వారి సమాధులపై మస్జిద్‌ కట్టి వివిధ భంగిమల్లో వారి ఫోటోలు తగిలించేవారు. అలాంటివారు అల్లాహ్‌ా దృష్టిలో ప్రజల్లోకెల్లా అత్యంత నీచమైన వాళ్ళు”. (ముత్తఫఖున్‌ అలై)
సమాధుల వైపు తిరిగి నమాజు చేయడం కూడా దీనిలోకే వస్తుంది. ప్రవక్త (స) దీని గురించి ఇలా చెప్పారు: ”సమాధులపై ‘ముజావర్‌’గా కూర్చోకండి. మరి వాటి వైపు తిరిగి నమాజు చేయకండి” . (ముస్లిం)
సమాధుల వైపు నిలబడి నమాజు చేయడం నిషిద్ధమైతే సమాధులపై నమాజు చేయడం ఇంకా తీవ్రమైన నిషిద్ధం.
దైవ ప్రవక్త (స) వారి ఈ హదీసులు సమాధులను ‘మస్జిద్‌’గా చేయడాన్ని ఖండిస్తున్నాయి. ఎందుకంటే దైవప్రవక్త (స) తన మరణానికి 5 రోజుల ముందు వీటి గురించి చాలా గట్టిగా తాకీదు చేశారు.
దైవప్రవక్త (స) మనల్ని ఈ చర్యల నుండి రక్షించాలని పలు విధాల ఉదాహరణలతో చెప్పారు. 1) యూదులు, క్రైస్తవులను శపించటం. 2) వారి వినాశనం కోసం దుఆ. 3) దేవుని సృష్టిలో వారిని పరమ నీచులుగా ఖరారు చేయడం. 4) జాగ్రత్త! సమాధులను ప్రార్థనాలయాలుగా చేసుకోకండి అని చెప్పడం.
ముస్లింలలో అధికుల ధోరణి:
బాధాకరమైన విషయం ఏమిటంటే ముస్ల్లింలలో అధికులు దైవప్రవక్త (స) నిషేధించిన విష వలయంలోనే ఇరుక్కున్నారు. దైవప్రవక్త (స) నిషేధించిన   పని చేసి షిర్క్‌ అక్బర్‌లో పడిపోయారు. సమాధులపై మస్జిద్‌లు, దర్గాలు నిర్మించి వారి పేరున బలిదానాలు, దుఆలు, మొక్కుబడులు చెల్లిస్తున్నారు. తల నీలాలు సమర్పిస్తున్నారు. మరి వీరు దైవ దృష్టిలో ఎలాంటివారిగా  పరిగణించబడతారో?
ఇమామ్‌ ఇబ్నె ఖయ్యిమ్‌ (స) ఇలా చెప్పారు: ఎవరైనా  ఒకవైపు దైవప్రవక్త (స) సంప్రదాయం మరియు సహాబాల విధానంన రెండో వైపు ప్రస్తుతం ముస్లింలు చేసే నిర్వాకాన్ని చూస్తే వారు ప్రవక్త (స) వారి సంప్రదాయానికి విరుద్ధంగా నడుచు కుంటున్నారన్న నిజం గ్రహిస్తారు. ఎందుకంటే -
అ) దైవప్రవక్త (స) సమాధుల వైపు తిరిగి నమాజు చేయకూడదని తాకీదు చేశారు. కాని వారు  సమాధుల వైపు తిరిగి  నమాజు చేస్తున్నారు.
ఆ) దైవప్రవక్త (స) సమాధులపై మస్జిద్‌ నిర్మాణం నిషేధించారు. కాని వారు సమాధులపై మస్జిద్‌లు, దర్గాలు నిర్మిస్తున్నారు.
ఇ) దైవప్రవక్త (స) సమాధులపై దీపాలు వెలిగించకూడదన్నారు. కాని వారు దీపాలు వెలిగిస్తున్నారు.
ఈ) దైవప్రవక్త (స) సమాధుల దగ్గర జాతర, ఉరుస్‌ చేయకూడదన్నారు. కాని వారు సమాధుల దగ్గర జాతర, ఉరుసులు, ప్రార్థనలు చేస్తున్నారు.
ఉ) దైవప్రవక్త (స) సమాధులను ఎత్తుగా చేయకూడదని, వాటిపై ఇల్లు వగయిరా కట్టకూడదన్నారు. కాని వారు మాత్రం సమాధులను ఎత్తుగా కట్టి గుంబద్‌లు నిర్మిస్తున్నారు. సమాధుల సందర్శనలోని అసలు ఉద్దేశ్యం:
హజ్రత్‌ బురైదా (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఓసారి ప్రజలతో ఇఆల అన్నారు: ఇంతకు ముందు నేను  మిమ్మల్ని  సమాధులను సందర్శించవద్దని వారించే వాణ్ణి. కాని ఇప్పుడు చెబుతున్నాను. మీరు సమాధులను సందర్శించండి. (ముస్లిం)
తిర్మిజీలో ఈ వాక్యం అదనంగా ఉంది: ”సమాధుల సందర్శనం పరలోకాన్ని జప్తికి తెస్తుంది. మరో చోట ఇలా ఉంది: ”ఈ సందర్శన ప్రాపంచిక వ్యామోహాన్ని తగ్గిస్తుంది”.


    ఇస్లాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో దైవప్రవక్త (స)  తన అనుచరులను సమాధుల్ని సందర్శించవద్దని చెప్పారు. అనుచరులు కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారవటం చేత సమాధుల్ని సందర్శించినప్పుడు అజ్ఞానకాలపు భావోద్రేకాలకు లోనై షరీయతుకు విరుద్ధమయిన పనులు చేస్తారేమోనని ఆయన ఆందోళన చెందేవారు. అయితే తర్వాతి కాలంలో వారు ఇస్లామీయ సూత్రాల్ని బాగా ఆకళింపు చేసుకుని నికార్సయిన ముస్లింలుగా పరిణతి చెందిన తర్వాత ఆయనకు ఆ భయం పోయింది. అప్పుడాయన తన అనుచరులు సమాధుల్ని సందర్శించేందుకు   అనుమతినిచ్చారు. పైగా తరచూ ‘సందర్శిస్తూ ఉండాల’ని తాకీదు చేశారు. తాము ఏదో ఒకనాడు మరణించేవారమేనన్న భావన  ప్రజల మనో మస్తిష్కాలలో మెదులుతూ ఉండాలన్నదే ఆయన ప్రవచనంలోని అసలుద్దేశ్యం. అంతేగాని సమాధుల వద్ద ఉరుసుల పేరుతో తమాషా చేయడానికి, మొక్కుకోవడానికి కాదు. ఈ రకమయిన చేష్టలకు షరీఅత్‌లో ఏ మాత్రం చోటు లేదు.

    అల్లాహ్ పై విశ్వాసం


    ప్రతి ముస్లిం అల్లాహ్ ఒక్కడే అని, ఈ సృష్టిలో ఆయన భాగస్వాములు ఎవ్వరూ లేరని, ఆయన పేర్లు మరియు లక్షణాల్లో ఎవ్వరూ సాటిలేరని విశ్వసిస్తాడు. అల్లాహ్ ఒక్కడే పూజించదగినవాడు అని తన చేష్టల ద్వారా చాటుతాడు.

    అల్లాహ్ పై ఈమాన్ నిర్వచనం

    ‘అల్లాహ్ పై విశ్వాసం’ అంటే- అల్లాహ్ ఉనికిని, అల్లాహ్ దైవత్వాన్ని,అల్లాహ్ శుభనామాలను మరియు అల్లాహ్ దివ్య లక్షణాలను దృఢంగా విశ్వసించడం.
    అల్లాహ్ పై ఈమాన్ షరతులు అల్లాహ్ పై విశ్వాసంలో నాలుగు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైతే వీటిని విశ్వసిస్తారో, వారు నిజమైన విశ్వాసులు

    .
    1. అల్లాహ్ ఉనికిని విశ్వసించడం

    ‘అల్లాహ్ ఉనికి’ హేతుబద్ధంగా, మానవ స్వభావసిద్ధంగా ధృవీకరించబడిన ఒక వాస్తవ విషయం.అల్లాహ్ ఉనికి గురించి షరిఅహ్ లో తెలుపబడిన అనేక వాస్తవాలు క్రింద తెలుపబడ్డాయి.

    i. అల్లాహ్ ఉనికిని నిరూపించే మానవ స్వాభావిక ఋజువు:

    తన సృష్టికర్తను విశ్వసించే స్వాభావిక విశ్వాసంతో ప్రతి మానవుడు సృష్టించబడతాడు. దీని గురించి అతడు ముందుగా ఆలోచించవలసిన అవసరంగాని లేక నేర్చుకోవలసిన అవసరంగాని లేదు. మార్గభ్రష్టత్వంలో పడిపోయిన వారు తప్ప, మరెవ్వరూ ఈ సహజసిద్ధమైన దైవవిశ్వాసం నుండి మరలిపోరు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: “ఫిత్రా (మానవుడి స్వాభావిక ఏకదైవ విశ్వాస) స్థితిలో కాకుండా ఏ బిడ్డా జన్మించడు. అయితే అతని తల్లిదండ్రులు అతడిని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేక అగ్నిపూజారిగానో మార్చి వేస్తారు.” [సహీహ్ బుఖారీ హాదీస్ నం: 4775, సహీహ్ ముస్లిం హాదీస్ నం: 2658.]
    ii. అల్లాహ్ ఉనికిని నిరూపించే హేతుబద్ధమైన ఋజువు: భూత, భవిష్య వర్తమాన కాలాలలోని ఈ సృష్టి తనను ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్తను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే సృష్టి తనకు తాను సృష్టించుకోలేదు లేదా ఏదైనా హఠాత్పరిమాణం, స్వయాన ఉనికిలో రాజాలదు.
    సృష్టి తనకు తానుగా ఉనికిలోనికి రావటం అసాధ్యం. ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను సృష్టించుకోలేదు: ఉనికి లోనికి రాక ముందు, అది సృష్టించబడనే లేదు. కాబట్టి, అదెలా తనను తాను సృష్టించుకోగలదు? అలాగే, ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రావడం కూడా అసంభవమైనదే. ఎందుకంటే, ఏది సంభవించినా దానికొక కారణముంటుంది. అంతేగాక, ఈ సృష్టి అత్యాద్భుతమైనదిగా, అత్యంత ఖచ్చితమైన విధంగా సృష్టించబడింది, ఇతర సృష్టితాల మధ్య ప్రతిదీ పొందికగా అమర్చబడింది. కారణానికి మరియు పర్యవసనానికి మధ్య దృఢమైన సంబంధం ఉంది. ఇవన్నీ నిరూపిస్తున్నది ఏమిటంటే ఈ సృష్టి ఏదో ఒక హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రాలేదు. ఎందుకంటే ఏదైనా హఠాత్తుగా జరిగితే, దాని పర్యవసానం ఇంత ఖచ్ఛితంగా మరియు ఇంత పరిపూర్ణంగా ఉండదు. కాబట్టి ఇది అంత ఖచ్చితమైన సమతుల్యంలో ఎలా మిగిలి ఉంది?
    సృష్టి తనకు తానుగా సృష్టించుకోవడం లేక ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికి లోనికి రావడం జరగనట్లయితే, వీటిని ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్త తప్పకుండా ఉండి తీరాలి. ఆయనే అల్లాహ్ – సకల లోకాల ప్రభువు.
    అల్లాహ్ ఈ హేతుబద్ధమైన సాక్ష్యాన్ని మరియు తిరుగులేని ఋజువును సూరా అత్ తూర్ లో పేర్కొన్నాడు (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం): “ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా?” సూరా అత్తూర్ 52:35
    అవి సృష్టికర్త లేకుండా సృష్టించబడలేదు. వాటికవే సృష్టించుకోవడమూ జరగలేదు. కాబట్టి, మహోన్నతుడైన అల్లాహ్ యే వాటి సృష్టికర్త. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరా అత్ తూర్ పఠిస్తూ, ఈ ఆయతు వద్దకు వచ్చినపుడు, జుబైర్ ఇబ్నె ముతిమ్ దానిని విన్నారు (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం): “ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా? లేదా భూమ్యాకాశాలను అవి సృష్టించాయా? లేదు, వారు దృఢమైన విశ్వాసం కలిగి లేరు. లేదా వారి వద్ద మీ ప్రభువు యొక్క భాండాగారాలేమైనా ఉన్నాయా? లేదా తమ ఇష్టానుసారం చేయగల అధికారం కలిగి ఉన్న నిరంకుశులా వారు? ” సూరా అత్ తూర్ 52:35-37. ఆ కాలంలో జుబైర్ అవిశ్వాసిగా జీవించేవారు. ఖుర్ఆన్ వచనాలు విన్న తర్వాత ఆయనిలా పలికినారు: “నా గుండె దాదాపు ఆగిపోయినట్లయింది. దైవవిశ్వాసం నా హృదయంలో ప్రవేశించిన మొట్టమొదటి క్షణమది.” (సహీహ్ అల్ బుఖారీ)

    అల్లాహ్ ఉనికిని నిరూపించేందుకు ఒక ఉదాహరణ.

    ఒక అందమైన రాజభవనం, దాని చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, వాటి మధ్య నదుల ప్రవాహం, సకల సౌకర్యాలు, అన్ని రకాల భోగభాగ్యాలతో కూడిన అలంకరణలు.ఇదంతా ఎవ్వరూ నిర్మించకుండా, హఠాత్తుగా దానికదే ఉనికిలోనికి వచ్చిందని ఒకవేళ ఎవరైనా మీతో చెబితే, వెంటనే మీరు దానిని తిరస్కరిస్తారు, నోటి మీదే అది ఒక పచ్చి అబద్ధం అని చెప్పేస్తారు. అది ఒక మూర్ఖమైన మాటగా పరిగణిస్తారు. మరిభూమ్యాకాశాలతో, నక్షత్రాలతో, అత్యద్భుతసువిశాల మరియు ఖచ్చితమైన సమతుల్యంతో కనబడుతున్న ఈ విశ్వం, దాని సృష్టికర్త ప్రమేయం లేకుండా దానికదే సృష్టించుకోవడం సాధ్యమా లేదా ఏదైనా హఠాత్పరిణామం వలన ఉనికిలోనికి రావడం సాధ్యమా?
    ఎడారిలో నివసించే ఒక పల్లెవాసి ఈ హేతుబద్ధమైన ఋజువును గ్రహించి, ఇతరులు అడిగిన ఈ ప్రశ్నకు ఆయన చాలా స్పష్టంగా బదులిచ్చిన ఈ సంభాషణను ఒకసారు పరిశీలిద్దాం. “నీ ప్రభువు గురించి నీవు ఎలా తెలుసుకోగలవు?” ఆయన జవాబు: “ఒకవేళ ఒంటె పేడ నీకు కనబడితే, ఆ దారి గుండా ఏదో ఒక ఒంటె వెళ్ళిందని నీవు గ్రహిస్తావు. అలాగే ఒకవేళ మనిషి పాదాల గుర్తులు నీకు కనబడితే, ఆ దారి గుండా ఒక మనిషి వెళ్ళినట్లు నీవు గ్రహిస్తావు. మరి, నక్షత్రాలతో నిండిన ఈ ఆకాశం, పర్వత మార్గాలతో కూడిన ఈ భూమండలం మరియు ఎత్తైన అలలతో కూడిన ఈ సముద్రాలు – ఇవన్నీ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడి ఉనికిని నిరూపించడం లేదా?”

    2. అల్లాహ్ సార్వభౌమత్వాన్ని విశ్వసించడం.

    అల్లాహ్ సార్వభౌమత్వం అంటే కేవలం అల్లాహ్ మాత్రమే ప్రభువు,ఆయనకు భాగస్వాములు గానీ, సహాయకులు గానీ ఎవ్వరూ లేరు. కానీ మానవులలో కొందరు ఈ పిలుపును తిరస్కరించి, అల్లాహ్ తో పాటు ఆరాధించడానికి, వేడుకోవడానికి, అర్థించడానికి ఇతరులను దేవుళ్ళుగా చేసుకున్నారు.
    సృష్టించే, ఆధిపత్యం చెలాయించే మరియు నియంత్రించే శక్తి గలవాడే ప్రభువు. అల్లాహ్ తప్ప మరో సృష్టికర్త లేడు. అల్లాహ్ తప్ప మరో సార్వభౌముడు లేడు. విశ్వలోకాలను నియంత్రించే శక్తి అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ లేదు. దీని గురించి అల్లాహ్ ఖురాన్ లోసూరా అల్ ఆరాఫ్ 7:54, సూరా యూనుస్ 10:31, సూరా సజ్దహ్ 32:5, సూరా ఫాతిర్ 35:13లో ఈ విధంగా తెలియజేసాడు. “నిశ్చయంగా, ఈ సృష్టి మరియు శాసనం ఆయనదే”
    “ప్రకటించు (ఓ ముహమ్మద్): ‘భూమ్యాకాశాల నుండి మీకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నది ఎవరు? లేదా వినికిడి శక్తి మరియు దృష్టి ఎవరి అధీనంలో ఉన్నాయి? మరణించిన వారిని తిరిగి సజీవం చేసేది మరియు సజీవంగా ఉన్నవారిని మరణింపజేసేది ఎవరు? విశ్వవ్యవహారాలను నడిపేది ఎవరు?’ (అని ప్రశ్నిస్తే), వారు ‘అల్లాహ్’ అని బదులిస్తారు. అపుడు వారినిలా ప్రశ్నించు: ‘మరి మీకు అల్లాహ్ శిక్షల భయం లేదా (ఆయన ఆరాధనలలో భాగస్వాములను చేర్చినందుకు?’)
    “భూమ్యాకాశాల మధ్య ఉన్న వాటి ప్రతి వ్యవహారాన్నీ ఆయనే నియంత్రిస్తాడు మరియు ఆయనే నడిపిస్తాడు; ప్రతిదీ ఆయన వైపుకే మరలుతుంది”
    “ఆయనే అల్లాహ్, మీ ప్రభువు; విశ్వసామ్రాజ్యం ఆయనదే. ఆయనను వదిలి ఎవరినైతే మీరు వేడుకుంటున్నారో, పిలుస్తున్నారో, అలాంటి వారు (విగ్రహాలు, అసత్యదైవాలు) ఖర్జురపు పండు పై నుండే పల్చటి దారం పోగుకు కూడా యజమానులు కారు.”

    3. అల్లాహ్ ఏక దైవత్వాన్ని విశ్వసించడం

    కేవలం అల్లాహ్ మాత్రమే నిజమైన ఏకైక ఆరాధ్యుడు, ఆయనకెవరూ సాటి లేరు మరియు ఆయనకెవరూ భాగస్వాములు లేరు.
    అల్ ఇలాహ్ అర్ధాలలో ఒకటి, ప్రేమించబడేవాడు. ప్రేమ మరియు గౌరవాభిమానాలతో ఆరాధించబడేవాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప. దీని గురించి అల్లాహ్ దివ్యఖురాన్ లో సూరా తాహ 20:14లో ఈ విధంగా తెలియజేసాడు
    ‘’యదార్ధం ఏమిటంటే నేనే అల్లాహ్ ను, నాకు తప్ప వేరే ఆరాధ్య దైవం లేనేలేడు కనుక నన్నేఆరాధించు’’.
    ఇంకా అల్లాహ్ ఆరాధ్య దైవమని సూరా ఆలె ఇమ్రాన్ 3:18లో స్వయంగా సాక్షమిస్తున్నాడు
    “ఆయన తప్ప మరే ఆరాధ్యుడూ లేడు అనడానికి అల్లాహ్ సాక్ష్యంగా ఉన్నాడు, దైవదూతలు మరియు జ్ఞానం కలిగిన వారు కూడా. ఆయనే తన సృష్టిని న్యాయంగా నడుపుతున్నాడు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడెవ్వడూ లేడు. మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడూను.”
    అల్లాహ్ ను వదిలి, ఆరాధించే ప్రతి దైవత్వం అసత్యమైనదే. దీని గురించి అల్లాహ్ సూరా అల్ హజ్ 22:62లో ఇలా పలుకుతున్నాడు.
    “ఎందుకంటే అల్లాహ్ మాత్రమే సత్యం. ఆయనతో పాటు (లేక ఆయనను వదిలి) వారు ఆరాధిస్తున్నవన్నీ అసత్యమైనవే. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, ఘనమైన వాడూను.”
    దేవుడిగా పిలవబడినంత మాత్రాన వాటికి దైవత్వం చేకూర్చదు. దీని గురించి అల్లాహ్ సూరా అల్ నజమ్ 53:23లో ఇలా పలుకుతున్నాడు
    “అవన్నీ మీరూ మరియు మీ తాతముత్తాతలు పెట్టుకున్న పేర్లు మాత్రమే. ఎలాంటి దైవత్వాన్నీ అల్లాహ్ వాటికి ప్రసాదించలేదు”
    సూరా యూసుఫ్ 12:39-40లో పూర్వపు ప్రవక్త అయిన యూసుఫ్ అలైహిస్సలాం జైలులో ఉంచబడినపుడు, అక్కడి రక్షకభటుడితో ఏకైక దేవుడైన అల్లాహ్ గురించి సంభాషిస్తూ ఇలా బోధించారు
    “అనేక మంది దేవుళ్ళు ఉండటం మంచిదా లేక ఏకైకుడు మరియు తిరుగులేని వాడైన ఒక్క అల్లాహ్ మాత్రమే ఉండటం మంచిదా? ఆయనను తప్ప ఇంకెవ్వరినీ ఆరాధించవద్దు. ఆయనను వదిలి నీవూ మరియు నీ తల్లిదండ్రులు కొలుస్తున్న దేవుళ్ళ పేర్లకు అల్లాహ్ ఎలాంటి దైవత్వాన్నీ ప్రసాదించలేదు.”
    అల్లాహ్ ప్రజలను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు పిలవటానికి ఆయన పంపిన ప్రతీ ప్రవక్తకు అల్లాహ్ తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు, ఆయన హక్కులో ఎవరికీ ఎలాంటి భాగస్వామ్యమూ లేదు,ఆయనకు అతి చేరువలో ఉండే దైవదూత అయినాసరే ,అని సూరా అల్ అంబియా 21:35, సూరా అన్నహల్ 16:36లో తెలియజేసాడు.
    “’లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు సందేశహరుడిని తప్ప, మేము మరే సందేశహరుడినీ నీకు పూర్వం పంపలేదు. కాబట్టి నన్ను మాత్రమే ఆరాధించు”
    “నిశ్చయంగా మేము ప్రతి సమాజంలో ఒక సందేశహరుడిని (ఇలా పిలిచేందుకు) పంపాము: “అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, తాగూత్ (అసత్యదేవుళ్ళ) లకు దూరంగా ఉండండి.”

    4. అల్లాహ్ దివ్యనామాలను, దివ్యలక్షణాలను విశ్వసించడం.

    అల్లాహ్ తన దివ్యగ్రంథంలో మరియు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలలో (సున్నతులలో) స్వయంగా అల్లాహ్ ధృవీకరించిన తన దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను ఆయన ఔన్నత్యానికి సరిపోయేటట్లుగా, వాటి భావాలలో ఎలాంటి మార్పులుచేర్పులు చేయకుండా, వాటిని సృష్టితో పోల్చుతూ రకరకాల ప్రశ్నలు వేయకుండా ధృవీకరించడం.
    “అత్యున్నతమైన నామాలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి. కాబట్టి వాటి ద్వారా ఆయనను వేడుకోండి. ఆయన దివ్యనామాలను తిరస్కరించే వారిని, నమ్మని వారిని విడిచి పెట్టండి. వారు చేస్తున్న దానికి తగిన ప్రతిఫలం పొందుతారు.” [అల్ ఆరాఫ్ 7:180]
    ఈ వచనం సూచిస్తున్నదేమిటంటే, అల్లాహ్ నామాలు అత్యన్నతమైన దివ్యనామాలు.పరిపూర్ణత్వపు లక్షణాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందునని ఈ వచనం సూచిస్తున్నది, ఎందుకంటే పరిపూర్ణత్వాన్ని సూచించే లక్షణమే “మహోన్నతమైన లక్షణం”.
    అల్లాహ్ దివ్యనామాలలో సమతూకం
    అల్లాహ్ దివ్య నామాలలో సమతూకపు విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. అది ఏమిటంటే క్రింద ఇవ్వబడే నాలుగు విషయాల నుండి ఏవరైతే దూరంగా ఉంటారో, అలాంటి వారు నిజంగా అల్లాహ్ ను విశ్వసించనట్లే. ఎవరైనా వీటిలో ఏ ఒక్క దానిని అనుసరించినా, అలాంటి వారు తమకు ఆదేశించబడిన దానిని శిరసావహించకుండా, అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలపై తగిన విధంగా నిజమైన విశ్వాసం పొందని వారవుతారు. వీటికి దూరంగా ఉండకుండా, ఎవరైనా సరే అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను విశ్వసించలేరు. ఉదాహరణకు
    1. తహ్రీఫ్ 2.తఅతీల్ 3.తమ్సీల్ 4. తక్ఈఫ్
    (i) తహ్రీఫ్
    తహ్రీఫ్ అంటే మార్పులు – చేర్పులు చేయడం. ఉదాహరణకు‘అత్యుత్తమమైన దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు కేవలం అల్లాహ్ కే చెందును’ అనే వాస్తవ భావార్థానికి భిన్నంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ఆమోదయోగ్యం కాని విధంగా ఖుర్ఆన్ ఆయతుల మరియు సున్నతు వచనాల భావార్థాలలో మార్పులు చేర్పులు చేయడం.
    (ii) తఅతీల్
    తఅతీల్ అంటే (తిరస్కరించడం) ఉదాహరణకు అల్లాహ్ దివ్యనామాలు దివ్యలక్షణాలను తిరస్కరిస్తూ, అవన్నీ లేదా వాటిలో కొన్ని అల్లాహ్ కు చెందవని చెప్పడం.ఖుర్ఆన్ మరియు సున్నతులలో పేర్కొనబడిన అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను తిరస్కరించే ప్రతి ఒక్కరూ అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను నిజంగా నమ్మనట్లే.
    (iii) తమ్సీల్
    తమ్సీల్ అంటే అల్లాహ్ ను ఆయన సృష్టితాలతో పోల్చడం. ఇంకా అల్లాహ్ దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడం. ఉదాహరణకు, అల్లాహ్ చేయి మానవుడి చేతి లాంటిదే అనడం, అల్లాహ్ వినికిడి శక్తి మానవుడి వినికిడి శక్తి లాంటిదే అనడం, అల్లాహ్ తన అర్ష్ పై అధిష్టించడం అంటే మానవుడు ఒక కుర్చీ పై కూర్చోవడం లాంటిదని చెప్పడం …. మొదలైనవి. నిస్సందేహంగా, అల్లాహ్ దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడమనేది ఒక పచ్చి అబద్ధం. దీని గురించి సూరా షురా 42:11లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు
    “ఆయనను పోలినదేదీ లేదు”


      (iv) తక్ఈఫ్
      తక్ఈఫ్ అంటే ఎలా సంభవమని చర్చించడం.ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి పరిమితమైన తన ఊహలకు లేక ఆలోచనలకు మాటల రూపాన్నిస్తూ, అల్లాహ్ దివ్యనామాలు దివ్యలక్షణాలు ఎలా సాధ్యం అనే విషయం పై చర్చించడం. ఖచ్చితంగా ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు. మానవుడికి వాటి గురించి తెలీదు. దీని గురించి సురా తాహా 20:110లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు
      “కానీ, ఆయన జ్ఞానంలో నుండి దేనినీ వారేనాడూ ఆవరించలేరు”

      శిష్ఠ వచన విశిష్ఠత


      (ఓ ప్రవక్తా!) ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌ – అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడని నువ్వు బాగా తెలుసుకో”. (ముహమ్మద్‌:19)
      ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ ఈ శిష్ఠ వచన ఆధారంగానే భుమ్యాకాశాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ వచన వ్యక్తీకరణ, స్మరణ కోసమే సృష్టి చరా చరాల సృజన జరిగింది. ఈ వచనం కోసమే అల్లాహ్‌ా ఇహపరాలను పుట్టించాడు. ఈ శిష్ఠ వచన పరిచయం కోసమే 1లక్ష 24వేల మంది దైవప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఈ వచన ఘనతా ఔన్నత్యాలను చాటడానికే దైవగ్రంథాలు అవతరించాయి. ఈ వచనం కోసమే తీర్పు దినం, లెక్కల ఘడియ, మహ్షర్‌ మైదానం ఏర్పాటు చేయబడింది. ఈ వచనం కోసమే స్వర్గనరకాలు చేయబడ్డాయి. ఈ వచన ఆధారంగానే మనుషులు, జిన్నాతులు-విశ్వాసులుగా, అవిశ్వాసులుగా, సజ్జనులుగా, దుర్జనులుగా, పుణ్యాత్ములుగా, పాపాత్ములుగా వర్గీకరించబడ్డారు. ఈ వచనం మూలానే సృష్టి అదృష్ట దురదృష్టాలు, సౌభాగ్యాసౌభాగ్యాలు, అభ్యున్నతి, అభ్యుదయాలు, ప్రగతి సాఫల్యాలు, సంక్షేమం శ్రేయో శుభాలు, శిక్షాబహుమానాలు ముడి పడి ఉన్నాయి. ఈ వచన ఆధా రంగానే రేపు మన కర్మల త్రాసు బరువుగానైనా, తేలికగానైనా తయా రవుతుంది. ఈ వచన ఆధారంగానే పరలోక మోక్షం ప్రాప్తమవు తుంది. ఈ వచన ఆధారంగానే కొందరు శాశ్వత నరకానికి ఆహుతి అయితే, మరికొందరు శాశ్వత స్వర్గానికి వారసులవుతారు. ఈ వచ నం గురించే అల్లాహ్‌ా పరమాణువుల లోకంలో సకల ఆత్మలతో ‘అలస్తు ప్రమాణం’-నేను మీ ప్రభువు కానా!’ అన్న ప్రమాణం తీసుకు న్నాడు. ఈ వచన ఆధారంగానే ముస్లింల ప్రార్థనా దిశ నియామకం జరిగింది. ఈ వచన ఆధారంగానే శ్రేష్ఠ సముదాయం వెలుగులోకి వచ్చింది.
      ఈ శిష్ఠ వచనం అల్లాహ్‌ తన దాసులకు అనుగ్రహించిన గొప్ప వర ప్రసాదం. ఈ వచన భాగ్యానికి మించిన భాగ్యం మరొకటి  లేదు. ఈ వచన స్థాపన కోసమే సకల ప్రవక్తలు, సత్పురుషులు సంఘ బహిష్కర ణలకు, హత్యలకు, మారణకాండలకు గురయ్యారు. కొందరు నిలు వునా రెండుగా రంపాలతో కోయబడ్డారు. కొందరిని సజీవంగానే ఉంచి ఇనుప దువ్వెనలతో రక్కి మాంసాన్ని ఎముకల నుండి వేరు పర్చడం జరిగింది. కొందరిని సలసల మరగే నూనేలో నెట్టి వేంచే యడం జరిగింది. కొందరిని నిప్పులపై పడుకోబెట్టడం జరిగింది. కొందరిని సాపల్లో చుట్టి పొగెట్టడం జరిగింది. కొందరిని శిలువనెక్కిం చడం జరిగింది. మరికొందరిని వ్రేలాడదీసి శరీరాన్ని ముక్కముక్కలు గా కోయడం జరిగింది. ఈ వచన ఆధారంగానే సత్యాసత్యాల మధ్య సమర జ్వాలలు భగ్గుమన్నాయి. ఇదే శిష్ఠ వచనం, ఇదే శాంతి వచ నం, ఇదే శ్రేష్ఠ స్మరణ, ఇదే శాంతి నిలయం అయిన స్వర్గానికి తాళం చెవి. ఈ వచనాన్నే అల్లాహ్‌ ‘కలిమతున్‌ తయ్యిబా-సద్వచనం’ అని ‘ఉర్వతున్‌ ఉస్ఖా-బలీయమయిన కడియం’ అని అభివర్ణించాడు. ఇదే  సత్య వచనం, ఇదే ధర్మ ప్రవచనం, ఇదే మహి మాన్విత, మహోత్కృష్ట పుణ్య వచనం. ఇదే చిత్త శుద్ధికి చిహ్నం, దాసుని అంకితభావానికి ఆనవాలు, పుణ్యఫలానికి పునాది. ఇదే ధర్మ సందేశం. ఇన్ని వీశిష్ఠతల కారణంగానే ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అన్నింటికంటే ఉత్కృష్ట అల్లాహ్‌ స్మరణ – ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌”. (తిర్మిజీ)
      ప్రవక్త నూహ్‌ (అ) వారికి మరణ ఘడియలు సమీపించినప్పుడు తన కుమారుణ్ణి పిలిచి ఇలా హితవు పలికారు: ”కుమారా! నేను నీకు రెండు విషయాల గురించి తాకీదు చేస్తున్నాను. రెండు విషయాల నుండి నిన్ను వారిస్తున్నాను. ఆయన చెప్పిన వాటిలో-”సప్తాకాశాలు, సప్త భూములు త్రాసు ఒక పళ్ళెంలో పెట్టి, ‘లా ఇలాహ ఇల్ల ల్లాహ్‌’ మరో పళ్ళెంలో పెట్టినట్లయితే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ ఉన్న పళ్ళమే వంగుతుంది’. సప్తాకాశాలు, సప్త భూములు ఒక ముద్దలా పదార్థంలా ఏర్పడితే వాటిన్నంటినీ లా ఇలాహ ఇల్లహ్‌ ఇల్లల్లాహ్‌ వేరు పరుస్తుంది. (అహ్మద్‌) ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది:
      ”భూమ్యాకాశాలు కలిసి ఉండగా, మేము వాటి ని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతీదానిని మేము నీటితో సృష్టించాము”. (అన్బియా:30)
      సృష్టి మొత్తం కలిసి కూడా ఈ వచనానికి సరి తూగజాలదు అంటే ఈ వచనం ఎంతటి మహి మాన్వితమయినదో అర్థం చేెసుకోగలరు. ఈ కారణంగానే విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) తన జాతి వారిని, తద్వారా సమస్త మాన వాళిని తొలుత పిలుపునిచ్చింది ఈ శిష్ఠ వచనం వైపునకే. ఓ ప్రజలారా! మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్‌ చెప్పండి. తద్వారా అరబ్బు, అరబ్బేతర ప్రాంతాలు మీ పాదాక్రాంతమవుతాయి’ అని చెప్పారు.
      ప్రియ పాఠకుల్లారా! ఒక వ్యక్తి ఈ వచనాన్ని చదివే ఇస్లాం పరిధిలోకి ప్రవేశిస్తాడు. మనం కూడా ఈ శిష్ఠ వచనం ఆధారంగానే ముస్లింలు గా పరగణించబడుతున్నాము. ఈ వచనం మరి
      పెద్దదేమీ కాదు. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’. అయితే ఈ వచనాన్ని ఓ వ్యక్తి మనసా, వాఛా, కర్మణా-త్రికరణ శుద్ధితో ఉచ్చరించిన మరుక్ష ణమే అతని జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి.
      ఆయన ఆబూ జర్‌ గిఫారీ (ర). మక్కా వచ్చిన ఆయన ప్రవక్త (స) ముహమ్మద్‌ వారితో కలవాలనుకున్నారు. కాని మక్కా అవిశ్వాసులు అంత సులువుగా ఎవరినీ ఆయనతో కలవనిచ్చేవారు కాదు గనక నక్కి నక్కి తిరగుతున్నా రాయన. ఎవరయినా గమనిస్తారేమోనని భయ పడుతున్నారు. చివరికి దైవప్రవక్త (స) వారి సన్నిధికి చేెరి ఈ శిష్ఠ వచన ప్రమాణం తీసుకున్న మరుక్షణం ఆయనలో ఎక్కడ లేని ధైర్యం పెల్లుబికింది. అప్పటి వరకు పిరికితనం ఆవహించిన ఆయన గుండె లో సాహసం ఉప్పొంగింది. క్షణం క్రితమే తనను ఎవరయినా గమని స్తారేమో అని భయపడిన ఆయన మొక్కవోని సాహసంతో కాబా ప్రాం గణంలోకెళ్ళి అందరి సమక్షంలో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ సద్వచన ప్రమాణాన్ని బాహాటంగా ప్రకటించారు.  అది విన్న అవిశ్వాస ప్రజలు ఆయనపై విరుచుకు పడ్డారు. ఆయన్ను చితక బాదుతున్నారు. అయినా ఆయన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ శిష్ఠ వచనాన్ని జపిస్తూనే ఉన్నారు. ఇది కేవలం ఆయన ఒక్కరి విషయంలోనే కాదు, బిలాల్‌, మస్‌అబ్‌ బిన్‌ ఉమైర్‌, సుమయ్యా, యాసిర్‌, అమ్మార్‌, ఖబ్బాబ్‌, అబూ సలమా, అబూ బకర్‌, సుహైబ్‌ రూమీ-ఇలా ఒక్కరిద్దరు కాదు వందలాది, వేలాది,లక్షలాది ప్రజల్లో, నేడు 170 కోట్ల మంది ప్రజల్లో చైతన్యాన్ని నింపిన సద్వచనం లా ఇలా ఇల్లల్లాహ్‌ా.
      అవును, ఈ శిష్ఠ వచనం చదవని క్షణ క్రితం వరకు కాఫిర్‌, అవిశ్వాసిగా ఉన్న మనిషి ఈ వచనం చదవిన మరుక్షణం అతను ముస్లిం, విశ్వాసి అయ్యాడు. ముందు అపరిశుద్ధ ఆలోచనలకు ఆలవాలంగా ఉన్న అతను ఇప్పుడు పవిత్ర ఆలోచనలకు నిలయంగా మారాడు. గతంలో అల్లాహ్‌ ఆగ్రహానికి ప్రాతుడయిన అతను, ఇప్పుడు అల్లాహ్‌ా అనుగ్రహానికి, అభిమానానికి అర్హుడయ్యాడు. ముందు స్వీయ సిద్ధాంతాల, నిజం లేని ఇజాల కారణంగా నరక వాసిగా ఉన్న అతను ఇప్పుడు స్వర్గవాసుల జాబితాలో చేరి పోయాడు. ఈ మార్పు ఇక్కడితోనే ఆగిపోయేది కాదు. అది మనిషి జీవితపు అన్ని అంగాల్లోనూ, అన్ని రంగాల్లోనూ, అతని సంబంధించిన క్రియలన్నిం టిలోనూ ఇది ప్రతిబింస్తుంది. ఈ వచనాన్ని సమ్మతించి పఠించే వారంతా ఒక సముదాయాం (ఉమ్మత్‌)గా, శ్రేష్ఠ సమాజంగానూ, దీన్ని త్రోసి పుచ్చినవారు మరో సంఘంగా రూపొందుతారు.
      ఏమిటి? కేవలం నాలుకతో కొన్ని అక్షరాలను, పదాలను ఉచ్చరించ డం వల్ల ఇంతటి పెనుమార్పు సాధ్యమేనా? అన్న సందేహం అందరికి రావచ్చు. నిజమే, మంత్రాలకే చింతకాయలు రాలుతాయో లేదో, పర్వ తాలు కంపిస్తాయో లేదో, భూమి బ్రద్ధలవుతుందో లేదో, సముద్రాలు ఉప్పొంగుతాయో లేదో ఆ మంత్రాలను సర్వస్వంగా భావించేవారి వివేకానికే, బుద్ధికే వదిలేద్ధాం. ఎందుకంటే, ప్రభావమంతా పదాల్లోనే ఉంటుందని, వాటిని పలుకగానే మాయా ద్వారాలు తెరుచుకుంటా యని వారి విశ్వాసం, నమ్మకం. కాని ఇస్లాంలో అలా కాదు. అర్థానికే ఇక్కడ అగ్రపీఠం. పరమార్థానికే ఇక్కడ ప్రాధాన్యత, శబ్ధ ప్రభావం అర్థానికి లోబడి ఉంటుంది. అర్థమే అర్థం కాకపోతే అనర్థాలు జరుగు తాయి.   ఈ వచన భావం మనో ధరణిలో నాటుకోకపోతే, దాని శక్తి వల్ల మన భావాలు, స్వభాలు, ప్రవర్తన, ఆచరణలు మారకపోతే కేవలం కొన్ని పదాలను ఉచ్చరించినంత మాత్రాన ప్రళయం ఏమి ముంచుకు రాదు. మహిమ ఏదీ జరిగిపోదు. మహిమ జరుగుతుంది, పెను మార్పు చోటు చేసుకుంటుంది. కాని ఎప్పుడు? ఎప్పుడయితే మనం ఆ వచనాన్ని నోటితో పలికి, మనసుతో అంగీకరించి, అవయవాలతో దానికనుగుణంగా సదాచరణలు చేస్తామో అప్పుడు.
      ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ ఈ శిష్ఠ వచనాన్ని మనం అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుని పలికినట్లయితే- అప్పుడు తెలుస్తుంది- మనం అల్లాహ్‌ా ఎదుట, సమస్త లోకాల ఎదుట ఎంత గొప్ప ప్రమాణం చేస్తు న్నామో. ఆ ప్రమాణం కారణంగా ఎంత గొప్ప బాధ్యత మనపై మోప బడుతుందో.
      ఈ వచనాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించాక మన భావ నలపై, అభిప్రాయాలపై, అలోచనపై, ఆచరణలపై, జీవితంలో ప్రతి విభాగంపై ఈ కలిమా ఆధిపత్యమే ఉండాలి. ఆ తర్వాత మన మనో మస్తిష్కాల్లో ఈ కలిమాకు విరద్ధమయిన ఏ విషయానికయినా, ఏ మాటకయినా, బాటకయినా చోటు ఇవ్వకూడదు. మన జీవితంలోని కార్యకలాపాలన్నింటిలో ఈ కలిమా మాత్రమే సర్వాధికారిగా ఉండాలి. ఎందుకంటే, ఈ కలిమాలో ఉన్నది సర్వలోక అధికారి అయిన అల్లాహ్‌ గనక.
      ఈ వచనం పలికిన మరుక్షణం ప్రవక్త (స) వారి మాట మన విష యంలో నిజమవుతుంది. అవిశ్వాసుల స్వర్గంగా ఉన్న ప్రపంచం మన కోసం అడుగడున ఆంక్షలతో కూడిన చెరసాలగా మారి పోతుంది.  ఇప్పుడి మనం అల్లాహ్‌ ఆజ్ఞాబద్ధులయి జీవించాలి. ఆయన ఆదేశిం చిన వాటన్నింటిని అమలు పర్చాలి. ఆయన వారించిన వాటన్నింటి నుండి వైదొలగాలి. మన ప్రతి చర్య, ప్రతి క్రియ, ప్రతి కదలిక, ప్రతి శ్వాస ఆయన ఆజ్ఞల పద్దుల్లోనే, ఆయన ప్రవక్త (స) వారి ఆదర్శల సరిహద్దుల్లోనే, ఆయన గ్రంథ హద్దుల్లోనే జరగాలి. అయితే ఇంతటి మహిమాన్విత వచనాన్ని నిత్యం ఉచ్చరించే ముస్లింల, మన  జీవితా ల్లో ఎందుకు ఆశించినంత మార్పు కనబడటం లేదు? ‘అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడు లేడు’ అంటూనే అనేకానేక మిథ్యాభావాల ఉచ్చులో బిగించుకుపోతున్నాము. ఆయన దరిని వదలి దరి దరిన తలను వంచుతున్నాము.  ఆత్మావలోకానికి సమయమిదే!

      17, జూన్ 2014, మంగళవారం

      ఇస్లాం యొక్క మూడవ కీలక భాగం – జకాత్


      ఇది ధనికుల నుండి వసూలు చేసి పేదలకు ఇవ్వబడే తప్పని సరి దానం. (పేదవారి ఆర్థిక హక్కు). ఇస్లాంలో నమాజు తర్వాత దీనికే అత్యధిక ప్రాధాన్యం ఉంది. ఇస్లాం ధర్మం నిర్ణయించిన కనీస సంపద కంటే ఎక్కవ సంపద కలిగిఉన్న ప్రతి ముస్లిం, ప్రతి సంవత్సరం తన సంపద నుండి కొంతభాగం తీసి నిరుపేదలకు, ఇస్లాం ధర్మసంస్థాపనా కార్యకలాపాలకు విధిగా దానం చేయాలి.
      [وَ  أَقِيمُوا  الصَّلَاةَ   وَآَتُوا  الزَّكَاةَ   وَ  أَطِيعُوا   الرَّسُولَ   لَعَلَّكُمْ   تُرْحَمُونَ] {النور56 : 24}
      అన్నూర్ 24׃56 “వ అఖీముస్సలాత వ ఆతూజ్జకాత వ అతీఉర్రసూల ల అల్లకుమ్ తుర్హమూన్”- “నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి, దైవ ప్రవక్తకు విధేయులుగా ఉండండి, అప్పుడు మీరు కరుణించబడతారు”
      జకాతు నిర్వచనం ׃ నిర్ణీత కాలమందు, నిర్ణీత వర్గం వారికి, నిర్ణీత నియమాలకు అనుగుణంగా తన సంపద నుండి చేయు ఓ విద్యుక్త దానం (త్యాగం).
       జకాతు చెల్లించడంలో గల లాభాలు ׃
      అల్లాహ్ ఆదేశపాలన – ప్రతి కోణం నుంచి ప్రతిస్ఫుటింపజేయాలి.
      పేదల-నిరుపేదల ఉద్ధారణ జరుగుతుంది.
      దీనిలో మానవుడు, దయా, కరుణ, కనికరం వంటి ఉదార గుణాలను పెంపొందించుకుని, పిసినిగొట్టు వంటి హీనగుణం నుంచి బయటపడతాడు.
       జకాతు విధిగా గల సంపద ( సొమ్ము) మరియు దాని రకాలు ׃
      బంగారము, వెండి, నగదు – పూర్తి సంవత్సరకాలం మోతాదుకు మించి నిల్వ ఉన్న ఎడల – ప్రతి సంవత్సరం
      వర్తక-వాణిజ్య వస్తువులు – ప్రతి సంవత్సరం
      పశు సంపద -  మోతాదుకు మించి ఉన్న పశువులు – ప్రతి సంవత్సరం
      వ్యవసాయం – భూమి నుండి పండించే అన్నిరకాల పంటలు – ప్రతి పంటకు
        జకాతు పొందు హక్కుదారులు ׃
       [ إِنَّمَا  الصَّدَقَاتُ  لِلْفُقَرَاءِ  وَالمَسَاكِينِ  وَالعَامِلِينَ  عَلَيْهَا  وَالمُؤَلَّفَةِ  قُلُوبُهُمْ  وَ فِي  الرِّقَابِ  وَ الغَارِمِينَ وَ فِي سَبِيلِ  اللهِ  وَ اِبْنِ  السَّبِيلِ  فَرِيضَةً  مِنَ  اللهِ  وَ اللهُ  عَلِيمٌ  حَكِيمٌ ] {التوبة:60}


         “ఇన్న మస్సదఖాతు లిల్ ఫుఖరాఇ, వల్ మసాకీని, వల్ ఆమిలీన అలైహా వల్ ము అల్లఫతి ఖులూబుహుం వ ఫిర్రిఖాబి వల్ గారిమీన వ ఫీ సబీలిల్లాహి వబ్నిస్సబీలి. ఫరీజతమ్ మినల్లాహి వల్లాహు అలీమున్ హకీం..” – “ఈ జకాతు నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అవసరాలు తీరని వారికి, జకాతు వ్యవహారాలకై నియుక్తులైన వారికి, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవడం అవసరమో వారికి, ఇంకా బానిసల విముక్తికీ, రుణగ్రస్తుల సహాయానికీ, అల్లాహ్ మార్గంలోనూ, బాటసారుల (ఆతిథ్యానికీ వినియోగించడం) కొరకు, ఇది అల్లాహ్ తరపు నుండి విధించబడిన ఒకవిధి. అల్లాహ్ అన్నీ తెలిసినవాడూ, వివేకవంతుడూను” (దివ్యఖుర్ఆన్: అత్తౌబ-  60)

        ఫిత్రా దానాల పరమార్థం


        ముస్లింలు జరుపుకునే ‘ఈదుల్‌ ఫిత్ర్‌’లో ఎన్నో పరమార్థాలు, పరిశుద్ధమైన భావాలు ఇమిడి ఉన్నాయి. అసలీ పండుగ పేరే ‘ఫిత్రాల పండుగ’ఈదుల్‌ ఫిత్ర్‌) కావటం గొప్ప విషయం.
        ఫిత్రాల ప్రధాన ఉద్దేశ్యం:
        1) నెల రోజులు కేవలం తమ ప్రభువు ప్రసన్నత కోసం ఉపవాసాలు పాటించిన వారంతా ఓ విధమైన ప్రత్యేక అనుభూతిని, ఆనందాన్ని, తృప్తిని పొందటం సహజం. అది నిజంగానే వారి కోసం పర్వదినం. ఆ రోజున వారు కొత్త బట్టలు ధరిస్తారు. సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. రుచికరమైన, ఇష్టకరమైన ఆహార పదార్థాలు భుజిస్తారు. నలువైపులా సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆ వాతావరణమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.  ఆ సంతోష సమయంలోనూ సమాజంలోని లేమికి గరయిన సోదరులను, నిరాధారులను, నిరుపేదలను, అనాథలను, వితంతువులను మరచిపోకండి అని తాకీదు చేస్తోంది ఇస్లాం. ”వారి కష్టాల్లో మీరూ పాలు పంచుకోండి. వారికి ఫిత్రా దానాలిచ్చి వారు కూడా సంతోషంగా పండుగ జరుపుకునేటట్లు చూడండి” అని ఉపదేశిస్తుంది ఇస్లాం.
        2) విశ్వాసులు ఈ నెలలో తమ ప్రభువు ప్రసన్నత నిమిత్తం పాటించిన ఉపవాసాలలో – మానవ సహజమైన దౌర్బల్యాల వల్ల జరిగిన చిన్న చిన్న తప్పులను, లోటుపాట్లను ఈ ఫిత్రా దానాలు ప్రక్షాళనం చేస్తాయి.
        Ads by bestmarkitAd Options
         హజ్రత్‌ అబ్దుల్లాహ్  బిన్‌ అబ్బాస్‌ (రజి) గారిచే ఉల్లేఖించబడిన ఒక హదీసులో ఇలా ఉంది: ”అనవసరమైన, అపసవ్యమైన మాటల నుండి ఉపవాసి పరిశుద్ధత పొందేందుకు, మరో వైపు అగత్యపరులకు ఆహారం ప్రాప్తించేందుకు గాను  మహా ప్రవక్త (సఅసం) ఫిత్రా దానాన్ని తప్పనిసరిగా నిర్ధారించారు”. (అబూ దావూద్‌, సుననె ఇబ్బు మాజా)
        ఫిత్రా ఆదేశం:
        అసలు ఫిత్రా అనే పదం ఇఫ్తార్‌ నుండి వచ్చింది. ఇది ముస్లింలపై తప్పనిసరి (వాజిబ్‌) గా ఖరారు చేయబడింది. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం ప్రకారం, మహా ప్రవక్త (స) ఫిత్రా దానాన్ని ప్రతి ముస్లింపై – అతను బానిస అయినా, స్వతంత్రుడైనా పురుషుడైనా, స్త్రీ అయినా, చిన్నవాడైనా, పెద్దవాడైనాసరే – విధిగా నిర్ణయించారు.   (సహీహ్  బుఖారీ, సహీహ్  ముస్లిం)
          ”ఆ రోజు నిరుపేదలు చేయి చాచి అడుక్కునే పరిస్థితి రాకుండా చేయండి” అని కూడా ఆయన (సఅసం) చెప్పినట్లు వేరొక ఉల్లేఖనంలో ఉంది.
        ఫిత్రా పరిమాణం:
        నిత్య జీవితంలో ఆయా ప్రాంతాల ప్రజలు తినే ఆహార ధాన్యాలలో నుంచి దేన్నో ఒక దానిని ఫిత్రాగా ఇవ్వడం ఉత్తమం. అనివార్యమైతే తప్ప నగదును ఫిత్రాగా ఇవ్వరాదు. దైవ ప్రవక్త (స) గానీ, ప్రవక్త ప్రియ సహచరులు (రజి)గానీ నగదు మొత్తాన్ని ఫిత్రా రూపంలో ఇచ్చినట్లు ఎక్కడా ఆధారాల్లేవు. అయితే మరీ అవశ్యం అనుకున్నప్పుడు నగదు రూపంలో ఇవ్వటంలో తప్పు లేదు.
         ఫిత్రా ఎప్పుడు ఇవ్వాలి?
        Ads by bestmarkitAd Options
          షవ్వాల్‌ నెలవంకను చూసిన క్షణం నుంచి ఫిత్రా చెల్లింపు తప్పనిసరి (వాజిబ్‌) అవుతుంది. అయితే పండుగ నమాజుకు ముందే ఈ పంపిణీ అయిపోవాలి. ఇబ్నె ఉమర్‌ (రజి)చే ఉల్లేఖించబడిన ఒక రివాయతులో రెండు రోజులు ముందుగా కూడా ఇవ్వవచ్చని ఉంది. మొత్తానికి స్పష్టమయ్యే దేమిటంటే ఈ ఫిత్రా దానాలు పండుగ నమాజుకు ముందే అవసరార్థులకు ముట్టాలి.
          హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) ఇలా అన్నారు: ”ఉపవాసిని వ్యర్థ విషయాల నుండి ప్రక్షాళనం చేయడానికి, అగత్య పరులకు ఆహార వస్తువులను సమకూర్చ టానికి దైవప్రవక్త (సఅసం) ఫిత్రా దానాన్ని విధిగా నిర్ధారించారు. కాబట్టి ఎవడు పండుగ నమాజుకు ముందే దీనిని చెల్లిస్తాడో అది వాని పాలిట జకాత్‌ అవుతుంది. అల్లాహ్  దానికి ఆమోదముద్ర వేస్తాడు. మరెవడు నమాజు తర్వాత చెల్లిస్తాడో అది సాధారణ దానంగా పరిగణించబడుతుంది”.  (అబూ దావూద్‌, ఇబ్నె మాజా)
        ఫిత్రా ఎవరికి ఇవ్వాలి?
          సాధారణంగా మనం జకాత్‌ను ఏ ఏ పద్దుల్లో వెచ్చిస్తామో ఆ పద్దుల్లోనే ఫిత్రాలను కూడా ఇవ్వవచ్చు. కాని నిరుపేదలకు, అగత్యపరులకు, పండుగ ఖర్చులకు ఏమీ లేనివారికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఎందుకంటే- ”వారు ఆ రోజున అడుక్కు తినే పరిస్థితి రాకుండా చూడండి” అని ప్రవక్త (స) గారు చెప్పి ఉన్నారు. అయితే తమ ప్రాంతాలలో బీదలు లేనప్పుడు మాత్రం ఇతరులకు ఫిత్రా ఇవ్వవచ్చు.
        హెచ్చరిక !
        Ads by bestmarkitAd Options
        1) ధనికురాలైన భార్య పేదవాడైన తన భర్తకు ఫిత్రా దానం చేయగలదు. కాని భర్త మాత్రం తన భార్యకు జకాత్‌ ఇవ్వలేడు. ఎందుకంటే భార్యను పోషించే బాధ్యత భర్తపై ఉంది. 2) ఒక రోజుకు సరిపడా ఆహార వస్తువులు కూడా లేని వ్యక్తి ఫిత్రా చెల్లించనవసరం లేదు. ఎందుకంటే కరుణామయుడైన అల్లాహ్  ఏ ప్రాణిపై కూడా శక్తికి మించిన భారం వేయడు.
        3) ఒక ఫిత్రాను అనేకమందికీ పంచవచ్చు. అనేక ఫిత్రాలను ఒక వ్యక్తికీ ఇవ్వవచ్చు. ఈ విషయంలో దైవప్రవక్త (స) ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదు.
        4) మరీ అవసరమైతే తప్ప ఒక ప్రాంతపు ఫిత్రాను మరో ప్రాంతానికి తరలించటం భావ్యం కాదు. జకాత్‌ మాదిరిగానే ఈ సూత్రం ఫిత్రాలకు కూడా వర్తిస్తుంది.  ప్రవాసాంధ్రులకు మనవి
        ప్రవాసాంధ్ర ముస్లిం సోదరులకు ఈ శుభ సందర్భంగా మేము చేసుకునే విజప్తి ఏమిటంటే;  వారు  వివాహితులైన  పక్షంలో తమ అధీనంలో ఉన్న కుటుంబ సభ్యులందరి ఫిత్రాలు విధిగా చెల్లించాలి. అవివాహిత వ్యక్తులు సయితం కువైట్‌ ప్రభుత్వం విర్ధారించిన లెక్క ప్రకారం తమ తరఫున ఫిత్రా ఇవ్వాలి – అంతేగాని ఇండియా నిసాబ్‌ ప్రకారం కాదు. తమ జిల్లాలకు, ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు సామూహికంగా ఫిత్రాలు వసూలు చేసి అక్కడే పంపిణీ చేస్తున్న పక్షంలో, ఫిత్రా మొత్తాలను ఆ సంస్థలకు ఇవ్వటం మంచిది. లేదంటే వారు తమ కుటుంబీకుల ద్వారానయినాసరే – పండుగకు ముందే అవసరార్థులకు ఫిత్రా ముట్టేలా జాగ్రత్త వహించాలి.
        ఫిత్రా చెల్లింపు తప్పనిసరి! పండుగకు ముందే ఫిత్రా హక్కుదారులకు ముట్టాలి!! అన్యధా అది ‘ఫిత్రా’ అనిపించుకోదు.

        చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు


        ”క్రయవిక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగపడని, సిఫారసు కూడా చెల్లని, (చివరి) దినము రాకపూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరిసంపదల నుండి (మా మార్గంలో) ఖర్చు పెట్టండి”.  (అల్‌ బఖర) ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ”ఎవరైనా తమ పరిశుద్ధమైన సంపాదనలో నుండి ఒక ఎండు ఖర్జూరమంత దానం చేసినా (అల్లాహ్‌ా పరిశుద్ధుడు, పరిశుద్ధ వస్తువులనే స్వీకరిస్తాడు) దాన్ని అల్లాహ్  తన కుడి చేత్తో స్వీకరిస్తాడు. సదఖా ఇచ్చువారికై దాన్ని వారు తమ దూడను పెంచిపోషించినట్లే ఆ సద్ఖాను పోషిస్తాడు. అది పెరిగి కొండంత పెద్దగా రూపొందుతుంది. (ముస్లిం, బుఖారీ)
        సదఖా అంటే అల్లాహ్  అభీష్టానికై అల్లాహ్  మార్గంలో ఖర్చు పెట్టడం అని అర్థం. సదఖా క్రియాత్మక విశ్వాసాన్ని వ్యక్త పరుస్తుంది.  నేను విశ్వసించే నా ప్రభువు మార్గంలో నా ధనం, ప్రాణం, సమయం అన్నీ అర్పితం అని తెలియపరుస్తుంది. ”నిస్సందేహంగా నా నమాజు, నా త్యాగం, నా జీవనంం నా మరణం- అన్నీ సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్  కొరకే”. (6:162)
        సదఖా అనగానే మన మనసుల్లో మొట్టమొదట వచ్చే భావన డబ్బు ఖర్చు పెట్టడం. ఎక్కువ ఖర్చు పెట్టినవారికే పుణ్యముంది, లేనివారికి లేదు అనే భావన రేకెత్తుతుంది. కాని సదఖా అనే పదానికి చాలా విస్తృతి ఉంది. మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తకు ప్రతి ఒక్కరి స్థోమత తెలుసు. ఎవరి వద్ద ఎంత శక్తీసామర్థ్యం ఉంది, ఎవరు ఏమి చేయగలరనేది అతనికి తప్ప మరెవ్వరికీ తెలియదు. అల్లాహ్  కొందరికి ధనం ఇచ్చాడు, కొందరికి విద్య, కొందరికి బుద్ధి, మరి కొందరికి వివేకము. ఐతే ఆయన మార్గంలో వీటన్నింటినీ ఉపయోగించడం కూడా సదఖాలోకే వస్తాయి.
        కొంతమంది ధనముండుట వలన అల్లాహ్  మార్గంలో రేయింబవళ్లు ఖర్చు పెట్తూ ఉంటారు. లేనివారు వారిని చూసి, నిరాశానిస్పృహలతో ‘మా వద్ద కూడా ధనముంటే ఎంత చక్కగా ఖర్చు పెట్టేవారమో’ అంటూ బాధపడతారు. అలాంటివారు ప్రవక్త (స) గారి ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అదేమంటే, ”మంచి మాట కూడా సదఖాయే”. మరొక హదీసులో ”నీవు ఏ చిన్న మేలునైనా కించపరచకు. అది నీ సోదరుడు నీతో కలిసినప్పటి చిరు మందహాసమైనా సరే” అని అనబడింది.
        ఒక సందర్భాన ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ”సదఖా ఇవ్వటం ప్రతి ముస్లింపై విధి” అన్నారు. అనుచరులు ‘ఓ ప్రవక్తా! డబ్బు లేనివారు ఏం చేయాలి?’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స) ”శ్రమించి మీరు లాభం పొందండి. ఆపైన దానం చేయండి. అదీ కాకపోతే మంచిని అనుసరించండి, చెడుకు దూరంగా ఉండండి” అని బదులిచ్చారు.
        ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా కూడా బోధించారు: ”మృదువుగా మాట్లాడటం సదఖా, నమాజు చేయటానికి మస్జిద్‌ వైపునకు తీసుకెళ్ళే ప్రతి అడుగూ సదఖా, ప్రతి పుణ్య కార్యం సదఖాయే, తన సోదరుడ్ని చిరునవ్వుతో ఆహ్వానించటం సదఖా, మీ బొక్కెన నుండి అతని బొక్కెనలో నీరు వంచటం కూడా సదఖాయే”.
        తాను ప్రవక్త (స) చెబుతుండగా విన్నానని హజ్రత్‌ బురైదా అస్లమీ అన్నారు: ”ప్రతి మనిషి శరీరంలో 360 జోళ్ళు (ఎముకలు) ఉంటాయి, ప్రతి ఎముకకు ఒక సదఖా చెల్లించాల్సిందే”. ఇదెలా సాధ్యం, ఎవరు చేయగలరిలా? అని సహచరులు ప్రశ్నించగా ఇలా ఆదేశించారు: ”మస్జిద్‌లో ఒక ఇటుక పడి ఉండుట చూసి దాన్ని పేర్చినా, దారిలో ఇతరులకు హాని కలిగించే  వస్తువును చూసి దాన్ని దారి నుండి తొలగించినా సదఖాయే, ఇది చేయలేని యెడల రెండు రకాతులు నమాజు చేసినా చాలు”.
        హజ్రత్‌ అబూ జర్‌ (రజి) ప్రవక్త (స) వద్దకు వెళ్ళి - ‘నా వద్ద ఏమీ లేదు, నేనెలా సదఖా చేయను?’ అని అనగా ఆయన (స) ఇలా బదులిచ్చారు, ”నీవు అల్లాహు అక్బర్‌, సుబ్హానల్లాహ్‌ా, అల్హమ్దులిల్లాహ్‌ా, లా ఇలాహ ఇల్లల్లాహ్  మరియు అస్తగ్ఫిరుల్లాహ్‌ా పలుకు, మంచిని ఆజ్ఞాపించు, చెడునుండి వారించు, ప్రజల దారి నుండి ఎముక లేక ముల్లు తీసివేయి, గ్రుడ్డివానికి దారి చూపించు, చెవిటివానికి, వెర్రివానికి మాట చక్కగా విడమర్చి చెప్పు, ఎవరినన్నా ఏదైనా వస్తువు వెతుకుతూ చూస్తే నీకు దాని జాడ తెలిస్తే చెప్పు, బలహీనున్ని లేపి నిలబెట్టు, నిస్సహాయునికి సహాయం చేయి, ఇవన్నీ సదఖాలోకే వస్తాయి” అన్నారు. అదీకాక ఓ రైతు పంట పండిస్తే దాన్నుండి పక్షులు తిన్నా, వచ్చేపోయే జనులు ప్రయోజనం పొందినా అదీ సదఖా క్రిందికే వస్తుంది.
        అల్లాహ్  మార్గంలో ఏ కొంచెం ఖర్చు చేసినా దాని పుణ్యము ఒకటి నుండి పది, పది నుండి 100, వంద నుండి 700 వరకు వృద్ధి చెందుతుంది. కొన్ని సదఖాలకు పుణ్యాలు తాత్కాలికంగా లభిస్తాయి, కొన్ని సదఖాల్లో పుణ్యం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఉదా: ఒక వ్యక్తి లాభదాయకమైన పుస్తకాన్ని పరుల ఉపయోగానికి లైబ్రరీలో పెట్టినట్లయితే దాని నుండి ప్రజలు లాభం పొందుతున్నంత వరకూ పుస్తకం పెట్టిన వ్యక్తికి తెలియకుండా పుణ్యం పెరుగుతూనే ఉంటుంది. అలాగే ఎవరైనా తమ పిల్లలకు మంచి మాట నేర్పిస్తే అలా ఈ మంచి ముందుకు సాగిపోతుంది.  నేర్పించిన వారి ఖాతాలో ఏ  బ్యాంకులూ, స్కీములూ ఇవ్వని లాభాలు చేరుతూ ఉంటాయి.
        ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ”దానం చేయువారి ధనం తగ్గదు, ఎవరైతే ఇతరుల తప్పులను క్షమిస్తారో వారికి అల్లాహ్  ఆదరణ ప్రసాదిస్తాడు, ఎవరైతే అల్లాహ్‌ా ముందు ప్రాధేయపడతాడో అతని ఆదరణను పెంచుతాడు”.ఒక వ్యక్తి తన భార్యాబిడ్డలపై ఖర్చు పెట్టటం కూడా సదఖాయే, వారిని పస్తులకు గురిచేసి ఇతరులపై ఖర్చు చేయటం మాత్రం తగదు. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు, ”తనపై, తన భార్యాపిల్లలపై ఖర్చుపెట్టేవాడికి  రెండింతలు పుణ్యం లభిస్తుంది. ఒకటి: సదఖా యొక్క పుణ్యం, రెండవది: తన సంబంధీకులను ఆదుకున్నందుకు పుణ్యం”. అలాగే ఒక ముస్లిం పుణ్యఫలాపేక్షతో తన కుటుంబీకులపై ఖర్చు పెడితే అతనికి దానం చేసిన పుణ్యం లభిస్తుంది అని కూడా అన్నారు.
        ఈ హదీసులన్నీ తెలియపరచేదేమంటే సదఖా చేయు వ్యక్తికి సంకల్ప శుద్ధి చాలా అవసరం. మనిషి సంకల్పాన్ని అల్లాహ్‌ా తప్ప మరెవ్వరూ ఎరుగరు, కాబట్టి దాని పుణ్యఫలానికి ఆధారం చిత్తశుద్ధి. చిత్తశుద్ధితో చేసిన చిన్న మంచి కార్యం కూడా అల్లాహ్  తలుచుకున్నంతవరకు పెంపొందుతూ ఉంటుంది. తీర్పు దినాన దానిని మనిషి ఆశ్చర్యచకితుడై చూస్తాడు. ప్రపంచంలో చేసిన ఆ కొంచెం పుణ్యానికి ఇంత ప్రతిఫలమా! అని విస్తుపోతాడు.
        ఈ విషయాన్నే మన వేమన కవి ఎలా వర్ణించాడో చూడండి:-
        చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
        కొంచైమైౖనా అదియు కొదువ కాదు
        విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత
         సంకల్పశుద్ధితో చేసిన సదఖాకు అల్లాహ్  ఇచ్చిన ఉదాహరణ ఇలా ఉంది: ”చిత్తశుద్ధితో, కేవలం అల్లాహ్‌ా సంతోషం పొందే ఉద్దేశ్యంతో వ్యయపరిచేవారి వ్యయాన్ని మెట్ట ప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ భారీ వర్షం కురవక, సన్నని జల్లు పడినా అదే దానికి చాలు. మీరు చేసేదంతా అల్లాహ్  దృష్టిలో ఉంది”. (2: 264) మరో చోట ఇలా ఉంది: ”తమ సంపదను అల్లాహ్  మార్గంలో ఖర్చు చేసేవారి ఖర్చు ఉపమానం ఇలా ఉంటుంది, ఒక్క విత్తనాన్ని నాటితే, అది మొలిచి ఏడు వెన్నులను ఈనుతుంది. ప్రతి వెన్నుకూ నూరేసి గింజలు ఉంటాయి, ఇదే విధంగా అల్లాహ్  తాను  కోరినవారి సత్కార్యాన్ని వికసింపజేస్తాడు”. (అల్‌ బఖరా)
        చిత్తశుద్ధి లేని యెడల దాని ప్రతిఫలం ఈ ప్రపంచంలోనే లభిస్తుంది పరలోకంలో ఏమీ ఉండదు.
        ”విశ్వసించిన ఓ ప్రజలారా! కేవలం పరుల మెప్పును పొందటానికే తన ధనం ఖర్చు చేసేవాని మాదిరిగా, మీరు దెప్పిపొడిచి, దానగ్రహిత మనస్సును గాయపరచి మీ దానధర్మాలను వృథా చేసుకోకండి. అతని దానాన్ని ఈ విధంగా పోల్చవచ్చు, ఒక కొండ రాతిపై ఒక మట్టి పొర ఏర్పడి ఉంది. భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్తా కొట్టుకుపోయింది. చివరకు మిగిలింది కొండరాయి మాత్రమే. ఇలాంటివారు తాము దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల వారికి ఏ ప్రయోజనమూ కలుగదు”. (అల్‌ బఖర)
        అందుకే మనం చేసే పుణ్యకార్యాలపై మనం గర్వంతో పొంగి పోకూడదు. ఇతరుల మెప్పు కోసం కాక అల్లాహ్  సంతోషం కోసమే చేయాలి. అప్పుడే దాని పరిణామం అందమైన రూపంలో  మనకు లభిస్తుంది. కొన్ని పుణ్యాలు మన మరణం తర్వాత కూడా మనకు సదకా జారియాగా చేరుతూ ఉంటాయి. ప్రవక్త (సల్లల్ల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు: ”విశ్వాసి చనిపోయిన తర్వాత కూడా లభించే పుణ్యాల్లో విద్యా దానం, పుణ్యకార్యాలు చేసే సంతానం, వారసత్వంగా వదిలిన ఖుర్‌ఆన్‌, ప్రజల ప్రయోజనార్థం జారీ చేసిన నీటి సరఫరా, ప్రయాణికులకై నిర్మించిన సత్రాలు, మరియు యవ్వనపు కాలంలో, పుష్టిగా ఉన్నప్పుడు చేసిన సదఖా”. పుష్టిగా ఉన్నప్పుడు చేసిన సదఖా పుణ్యం ఎక్కువగా ఉంటుంది, కారణం ఆ సమయంలో మనిషికి కోరికలు కాంక్షలెక్కువగా ఉంటాయి, ధన వ్యామోహంతోపాటు భవిష్యత్తు యొక్క దిగులు ఉంటుంది. కాబట్టి అప్పుడు చేసిన సదఖాలకు పుణ్యం అధికం. ఇలా మనం చేసే ప్రతి సత్కార్యానికి పుణ్యమార్జించటం సులభమే. కాని దానికి కావలసింది చిత్తశుద్ధి, మంచి సంకల్పం, అల్లాహ్  దాన్ని ఆమోదించాలనే ఆపేక్ష .

        జకాత్‌ వ్యవస్థ


        ఇస్లాం సౌధానికి ఉండే అయిదు మూల స్తంభాల్లో విశ్వాస ప్రకటనం, నమాజు తర్వాత ‘జకాత్‌’ మూడవ మూలస్తంభంగా ఆరాధనా విధుల్లో రెండవ మూలస్తంభంగా పరిగణంచబడింది. ఖుర్‌ఆన్‌లో కనీసం 32 చోట్ల నమాజుతోపాటు జకాతు ప్రస్తావన వచ్చింది. దీన్ని బట్టి జకాతుకు ఎంత ప్రాముఖ్యం ఉందో తెలుస్తుంది. ఖుర్‌ఆన్‌ అనేక చోట్ల నమాజ్‌, జకాత్‌లను గురించే ఎక్కువ ప్రస్తావించడం గమనిస్తే, మొత్తం దైవారా ధనల్లో వీటి విశిష్ఠత ఏపాటిదో గ్రహించగలం. ఖుర్‌ఆన్‌లోని సూక్తులు చదవండి: ”(సత్యాన్ని) విశ్వసించి సదాచార సంపన్నులయి నమాజును నిర్వహిస్తూ, జకాతును చెల్లి స్తూ ఉండేవారికి వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద సిద్ధంగా ఉంది. వారికి ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు”. (అల్‌ బఖరా: 277)
         ”వారు నమాజ్‌ స్థాపిస్తారు; జకాత్‌ చెల్లిస్తారు; అల్లాహ్‌కు తప్ప మరెవరికీ భయపడరు. అలాంటివారే సన్మార్గంలో నడుస్తారని ఆశించబడుతుంది”. (తౌబా: 18)
         ”విశ్వసించిన స్త్రీలు, పురుషులంతా ఒకరికొకరు స్నేహితులు, శ్రేయోభిలాషులు. వారు మంచి విషయాలు బోధిస్తారు. చెడు విషయాల నుండి వారిస్తారు. నమాజును స్థాపి స్తారు. జకాత్‌ను నెరవేరుస్తారు. అల్లాహ్‌ పట్ల, ఆయన ప్రవక్త పట్ల వినయవిధేయతలతో మసలుకుంటారు. వీరిపైనే అల్లాహ్‌ కారుణ్యం వర్షిస్తుంది”. (అత్తౌబా: 71)
        Ads by bestmarkitAd Options
         ఇస్లాం మానవులపై ముఖ్యంగా రెండు రకాల బాధ్యతలు మోపుతోంది. 1) దేవుని హక్కులు. 2) దాసుల హక్కులు. నమాజ్‌ మనిషిని దేవుని హక్కులు నెరవేర్చేందుకు సమాయత్తపరుస్తుంది. జకాత్‌ దాసుల హక్కులు నెరవేర్చడం గురించి బాధ్యతాభావాన్ని జనింపజేస్తుంది. కనుకనే జకాత్‌ చెల్లించనివారిని ఖుర్‌ఆన్‌ తీవ్రంగా మందలిస్తుంది: ”పరలోకాన్ని తిరస్కరించి జకాత్‌ (విధి) నెరవేర్చని బహుదైవారాధకులకు వినాశనం రాసి పెట్టి ఉంది”. (ఖుర్‌ఆన్-41: 6,7)
         దేవుడు మానవునికి ఈ లోకంలో అనేక రకాల సంపదలు ప్రసాదించాడు. అందు కతను అల్లాహ్‌ాకు కృతజ్ఞుడయి ఉండటంతోపాటు, ఆ సంపదలో కొంత భాగం నిరు పేదలక్కూడా అంజేయాలి. స్తోమత కలిగినవారు తమ ధన కనక వస్తు సంపదల నుండి ప్రతి సంవత్సరం రెండున్నర శాతం చొప్పున తీసి ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన 8 రకాల ప్రజలకు ఇవ్వాలి. దీన్ని జకాత్‌ అంటారు.
         అంతే కాకుండా వారు ధాన్యం, అపరాలు, పండ్లు, కూరగాయలు తదితర భూ ఉత్పత్తుల నుండి కూడా జకాత్‌ తీయవలసి ఉంటుంది. దాన్ని ‘ఉష్ర్‌’ అంటారు. అయితే ‘ఉష్ర్‌’ ఏడాదికి ఒకసారి మాత్రమేగాక, సంవత్సరానికి ఎన్ని సార్లు పండితే అన్నిసార్లు తీయాల్సు ఉంటుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”విశ్వసించినవారలారా! మీరు సంపా దించిన దానిలో, మేము నేల నుండి మీ కోసం ఉత్పత్తి చేెసిన దానిలోనూ శ్రేష్ఠమయిన దాన్ని దైవమార్గంలో ఖర్చు చేయండి”. (బఖరా: 267) ”పంట కోతకు వచ్చినప్పుడు అందులో నుంచి అల్లాహ్‌ హక్కు కూడా నెరవేర్చండి. దుబారా చేసేవారిని అల్లాహ్‌ ప్రేమించడు”. (దివ్యఖుర్‌ఆన్-6: 141)
        Ads by bestmarkitAd Options
         జకాత్‌ వ్యవస్థ వాస్తవానికి సమాజంలో ప్రజలకు ఆర్థిక న్యాయాన్ని చేకూర్చే అపురూప సాధనం. ఇది ప్రజల హృదయాల నుండి స్వార్థం, సంకుచితత్వం, పిసినారితనం, పేరాశ, అసూయ, ద్వేషం, కాఠిన్యం, దోపిడి లాంటి వినాశకర భావాలను తీసేసి వాటి స్థానంలో ప్రేమ, పరోపకారం, త్యాగం, సానుభూతి, శ్రేయోకామన, సహకారం, స్నేహశీలత, చిత్తశుద్ధి, ఔదార్యం వంటి సద్భావాలను పెంపొందిస్తుంది. జకాత్‌ ప్రభుత్వాలు ప్రజలపై విధించే పన్ను లాంటిది కాదు. ఇదొక ధన సంబంధమైన దైవా రాధన. జకాత్‌ వ్యవస్థ వల్ల వ్యక్తికి, సమాజానికి అత్యున్నత నైతికత, ఆధ్యాత్కిత ప్రయోజ నాలు ఒనగూడుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇస్లాం శారీరక ఆరాధనలతోపాటు ధన సంబంధమయిన ఆరాధనలకు ముఖ్యంగా జకాత్‌కు ఎంతో ప్రాముఖ్యం ఇస్తుంది. మనిషికున్న సంపదలో తనకంటే దిగువ స్థాయిలో ఉండే జనాలకు ఒక ఖచ్చితమైన హక్కు ఉంటుంది. ఇక్కడ్నుంచే ఇస్లామీయ అర్థశాస్త్రానికి పునాదులు ప్రారంభమవుతాయి.