5, మార్చి 2014, బుధవారం

అహద్‌, అహద్‌, అహద్‌


-Abul hasan

ఖర్జూర తోటల్లో విహరించడం తప్ప
నిప్పులు చెరిగే ఎండలెరుగడు
అత్తర్‌ సువాసనల గుభాళింపులు తప్ప
చెమట వాసన లెరుగడు
మఖ్మల్‌ తివాచీల కొలువు తప్ప
మట్టిలో కాల్మోపి ఎరుగడు ముస్‌అబ్‌

అయినా -
అతనిలో సత్యాన్వేషణేదో
ఆత్మ వివేకాన్ని చిలికింది
హృదయ తలుపులు తెరిచింది
సత్య సందేశం వినగానే
పరవసించింది ముస్‌అబ్‌ హృది
పట్టు వస్త్రాలు మానుకున్నాడు
గుండీల బదులు ముళ్ళు గుచ్చుకున్నాడు
చినిగిన చొక్కా తొడుక్కున్నాడు
కటిక నేల మీద పడుకున్నాడు

సత్య వాక్కును నొక్కివేయాలని
నీతి నిజాయితీలని తొక్కివేయాలని
మొగ్గ తొడిగే మోక్ష కాంక్షను
ఆదిలోనే తృంచి వేయాలని
శిలాప్రతిమ పూజారులు
శరవేగంతో వ్యూహం పన్నారు

చేదు విషం మింగవలసి వస్తుందని
కటకటాల్లో కృంగవలసి వస్తుందని
వెనుకాడ లేదు ఖబ్బాబ్‌
దిక్కు చూడలేదు అమ్మార్‌

శిలువపై వ్రేలాడదీసినా
శరీరంలో మేకులు దించినా
నిప్పులపై దేహం కాల్చినా
అహద్‌, అహద్‌, అహద్‌,
అను నినాదాలతో అల్లాహ్‌,
అల్లాహ్‌ా, అల్లాహ్‌లను ప్రణాదాలతో
కదిలారు సహాబాలు
వదిలారు ప్రాణాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి